ఈ సీజన్ లో ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టిన కేకేఆర్... రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీ

  • రాజస్థాన్‌ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్
  • అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించిన ఫినిషర్ రింకూ సింగ్
  • 156 పరుగుల లక్ష్య ఛేదనలో 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్
  • కేకేఆర్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే పరిమితమైన రాజస్థాన్
  • వరుణ్ చక్రవర్తి, కార్తీక్ త్యాగి చెరో మూడు వికెట్లతో విజృంభణ
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) అద్భుత విజయాన్ని అందుకుంది. టాపార్డర్ కుప్పకూలిన క్లిష్ట పరిస్థితుల్లో ఫినిషర్ రింకూ సింగ్ (53*) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో, రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో, ఎట్టకేలకు ఈ సీజన్ లో కేకేఆర్ తొలి విజయం అందుకుంది. టోర్నీలో ఇప్పటిదాకా 7 మ్యాచ్ లు ఆడిన కోల్ కతా జట్టు 5 మ్యాచ్ ల్లో ఓడి, ఒకదాంట్లో నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది.

నేటి మ్యాచ్ లో 156 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ (0), కెప్టెన్ అజింక్యా రహానే (0) డకౌట్ అయ్యారు. దీంతో 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కామెరూన్ గ్రీన్ (27) వేగంగా ఆడినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో కేకేఆర్ 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్‌కు అనుకుల్ రాయ్ (29*) అండగా నిలిచాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు అజేయంగా 76 పరుగులు జోడించి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రాజస్థాన్ బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (39), వైభవ్ సూర్యవంశీ (46) శుభారంభం అందించినా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, కార్తీక్ త్యాగి కూడా 3 వికెట్లతో రాణించాడు. సునీల్ నరైన్ రెండు వికెట్లు తీసి రాజస్థాన్ పతనాన్ని శాసించాడు.

Rinku Singh
KKR
Kolkata Knight Riders
Rajasthan Royals
IPL 2024
Indian Premier League
Varun Chakravarthy
Sunil Narine
Eden Gardens
Cricket

More Telugu News